హైదరాబాద్: భారత కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకే సమయంలో ఎన్నికలను (జమిలి) నిర్వహించేలా ముందుకు వెళ్తోంది. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని పార్టీ నేతలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు సూచించారు.
ఆదివారం ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామనే నిరాశలో ఉండొద్దు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గ్రేటర్ ఎన్నికలను మనం ఒక కొత్త అనుభవంలా మాత్రమే చూడాలి. ఎన్నికల్లో ఓడిపోయిన వారి పట్ల చులకన భావంతో ఉండకండి.
ఓడిపోయిన డివిజన్లలోని అభ్యర్థులే మన పార్టీకి చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించండి. సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు ఇచ్చే విషయంలో మనం కొంత ఆలోచించి ఉండాల్సింది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై దృష్టి పెట్టాల్సిందిగా ఆదేశించారు.
దేశవ్యాప్తంగా ఈ నెల 8న జరిగే భారత్ బంద్‌కు మద్దతుగా రైతులకు సంఘీభావంగా హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ భేటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, గ్రేటర్ పరిధిలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.