అమరావతి: భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 120 రోజుల ముందుగానే రైలు టికెట్ బుకింగ్ సదుపాయం ఉండగా, నవంబర్ 1, 2024 నుంచి ఇది 60 రోజులకు తగ్గించబడింది. ఐఆర్‌సీటీసీ (IRCTC) నిబంధనల్లో మార్పులు చేసి, ప్రయాణికులకు ముందస్తు బుకింగ్ కోసం సమయం తగ్గించడంతో ప్రయాణ యోధులకు కొత్త రూల్స్ వర్తిస్తాయి. అక్టోబర్ 31, 2024 వరకు పాత నిబంధనలు కొనసాగుతాయని, ఆ తర్వాత కొత్త మార్పులు అమలులోకి వస్తాయని రైల్వే వర్గాలు తెలిపాయి.
ఆర్‌పీ తగ్గింపు కారణాలు వెల్లడి కాలేదు
భారతీయ రైల్వే ఈ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) తగ్గించడానికి గల ప్రత్యేక కారణాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే, ప్రస్తుత మార్పులు ప్రయాణికులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు తీసుకున్న చర్యలుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు రైలు ప్రయాణానికి నాలుగు నెలల ముందుగానే టికెట్ బుకింగ్ సదుపాయం ఉండేది, అయితే తాజా మార్పులతో ఆ సమయం కేవలం రెండు నెలలకు పరిమితం అవుతోంది.
ఇతర రైళ్లలో మార్పులు లేవు
తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లకు ఎలాంటి మార్పులు చేయలేదు. ఆ రైళ్ల బుకింగ్ వ్యవధి ఇప్పటికే తక్కువగా ఉండడం వల్ల, ఇవి ఈ కొత్త మార్పుల నుండి మినహాయింపులు పొందాయి. అంతేకాకుండా, విదేశీ పర్యటకులు మాత్రం ఏడాదంతా ముందుగానే టికెట్ బుక్ చేసుకునే అవకాశం యథావిధిగా కొనసాగుతుంది.
UTS యాప్ అప్‌డేట్: మరింత సులభతరం
జనరల్ టికెట్ బుకింగ్ కోసం ఉపయోగపడే UTS (Unreserved Ticketing System) మొబైల్ యాప్‌కు రైల్వే శాఖ కొత్త అప్‌డేట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు UTS యాప్‌లో జియో ఫెన్సింగ్ పరిమితులు ఉండేవి. ఇప్పుడు వాటిని తొలగించడం ద్వారా ప్రయాణికులు ఏ రైల్వే స్టేషన్‌కు అయినా టికెట్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు. క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం మరింత సౌకర్యవంతంగా మారింది.