మూవీడెస్క్: తెలుగు సినీ స్టార్లు రీల్ హీరోలే కాదు, రియల్ హీరోలు అని రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ఎంతోమంది ఇళ్లు కోల్పోయారు, పంటలు దెబ్బతిన్నాయి, తాగడానికి నీరు లేక, ఆహారం అందని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సమయంలో ప్రజల్ని ఆదుకునేందుకు, బాధితులను సాయం చేసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకు వచ్చి భారీ విరాళాలు ప్రకటించారు. వారు ప్రకటించిన విరాళాల జాబితా ఇదీ:
- పవన్ కళ్యాణ్: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1 కోటి విరాళం ప్రకటించారు. అలాగే, పంచాయతీరాజ్ మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లోని 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1 లక్ష చొప్పున 4 కోట్లు అందించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 6 కోట్లు విరాళం ప్రకటించారు.
- ప్రభాస్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు విరాళం ప్రకటించారు. తెలంగాణకు 1 కోటి, ఆంధ్రప్రదేశ్‌కు 1 కోటి విరాళం అందించారు.
- చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాలకు కలిపి 1 కోటి విరాళం ప్రకటించారు.
- రామ్ చరణ్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం రెండు రాష్ట్రాలకు కలిపి 1 కోటి విరాళం అందజేశారు.
- మహేశ్ బాబు: సూపర్ స్టార్ మహేశ్ బాబు రెండు రాష్ట్రాలకు కలిపి 1 కోటి విరాళం అందజేశారు.
- అల్లు అర్జున్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండు రాష్ట్రాలకు 1 కోటి విరాళం ప్రకటించారు.
- నందమూరి బాలకృష్ణ: రెండు రాష్ట్రాలకు 1 కోటి విరాళం ప్రకటించారు.
- త్రివిక్రమ్ & చినబాబు: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత చినబాబు కలిసి 50 లక్షలు విరాళం ప్రకటించారు.
- వైజయంతి మూవీస్: ఈ అగ్ర నిర్మాణ సంస్థ రెండు రాష్ట్రాలకు కలిపి 45 లక్షలు విరాళం అందజేసింది.
- విశ్వక్ సేన్: మాస్ కాదాస్ విశ్వక్ సేన్ రెండు రాష్ట్రాలకు 10 లక్షలు విరాళం ఇచ్చారు.
- వెంకీ అట్లూరి: యువ దర్శకుడు వెంకీ అట్లూరి రెండు రాష్ట్రాలకు 10 లక్షలు విరాళం అందజేశారు.
- అనన్య నాగళ్ళ: హీరోయిన్ అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు 5 లక్షలు విరాళం అందించారు.
- సిద్దు జొన్నలగడ్డ: యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ రెండు రాష్ట్రాలకు 30 లక్షలు విరాళం ఇచ్చారు.
- సోనూ సూద్: పాన్ ఇండియా స్టార్ సోనూ సూద్ రెండు రాష్ట్రాలకు కలిపి 2 కోట్లు విరాళం ప్రకటించారు.
- సందీప్ కిషన్: యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సహాయక చర్యల్లో భాగంగా తన వంతు సహాయం అందిస్తున్నారు.
ఈ విధంగా తెలుగు సినీ ప్రముఖులు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తూ, గొప్ప మనసు చాటుకుంటున్నారు.