న్యూఢిల్లీ: భారతదేశంలో జరిగిన ఘోరం అయిన ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (61) ని శనివారం అరెస్ట్ చేశామంటూ పాక్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. 2008లో ముంబై ఉగ్ర దాడుల మాస్టర్ మైండ్ లఖ్వీని తమ కౌంటర్ టెర్రరిజం విభాగం (సీటీడీ) అరెస్టు చేసిందని పాక్ ప్రకటించింది. అయితే లఖ్వీని అరెస్టు చేసిన స్థలాన్ని అధికారులు ప్రస్తావించలేదు.
ముంబై దాడుల మాస్టర్ మైండ్ లఖ్వీని అదుపులోకి తీసుకున్నామని పాక్ పోలీసులు ప్రకటించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూరుస్తున్నాడన్న ప్రధాన కారణంతో అతడిని అరెస్ట్ చేసినట్టు సీటీడీ తెలిపింది. లఖ్వీ ఒక డిస్పెన్సరీని నడుపుతూ, ఉగ్రవాద చర్యలకు, ఆ నిధులను ఉపయోగిస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ నిధులను ఉగ్రవాద ఫైనాన్సింగ్‌తో పాటు వ్యక్తిగత ఖర్చులకు కూడా ఉపయోగించాడని పేర్కొంది.
ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయమై లాహోర్‌లో నమోదైన కేసు ఆధారంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, ఆ సంస్థకు ఆర్థికంగా సాయం చేస్తున్న లఖ్వీని పట్టుకున్నామని పాక్ పోలీసులు వెల్లడించారు. అయితే లఖ్వీని ఎప్పుడు, ఎలా అరెస్ట్ చేశారన్న వివరాలను మాత్రం పాక్ వెల్లడించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.