ముంబయి: సంచలనాలకు మారుపేరైన జియో మరో సంచలనానికి సిద్దమవుతోంది. 4జీ సేవలను సంచలనంగా ప్రారంభించిన జియో ఇప్పుడు అదే రీతిలో 5జీ సేవలు కూడా అందుబాటులోకి తేనుంది. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే వచ్చే ఏడాది ఈ సేవలను వినియోగంలోకి తీసుకురావడానికి జియో కృషి చేస్తోంది.
జియో 5జీ సాంకేతికత ప్రారంభం నుండి 100 శాతం దేశీయ సాంకేతికత మరియు దేశియ సొల్యూషన్స్ ని ఉపయోగించి డిజైన్ చేయడం జరిగిందని తెలియజేయడానికి గర్విస్తున్నానని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ 43వ ఏజీఎం లో ప్రకటించారు.
అంతే కాకుండా ఆండ్రాయిడ్ ఆధారిత చౌకైన 5జీ మొబైల్ తయారీలొ కూడా ఉన్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. ఇందుకు గూగుల్ తో జత కట్టినట్లు ఆయన తెలిపారు. ఆండ్రాయిడ్ ఆధారిత కంప్యూటింగ్ సేవలను భారత్ కు చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు.
స్థానిక సంస్థలతో భారత్ లో కార్యకలాపాలను విస్తరించే దిశగా ఇది తొలి అడుగు అని గుగులో సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్ ఇప్పటికే భారత్ లో రూ 70 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు రిలయన్స్ జియోలోను రూ 33,373 వేల కోట్లతో 7.7 శాతం వాటా కొనుగోలు చేయనుంది.
రిలయన్స్ తొలిసారిగా తన ఏజీఎం ను తమ ఆన్ లైన్ ప్లాట్ ఫారం జియో మీట్ తో నిర్వహించగా దాదాపు 48 దేశాలలోని 550 నగరాల నుండి 3.2 లక్షల మంది షేర్ హోల్డర్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
5జీ సాంకేతికత పరిచయం అవుతున్న నేపథ్యంలో భారత్ లో 2జీ మొబైల్స్ నుండి భారత్ కు విముక్తి ఇవ్వాలని, 2జీ వాడుతున్న 35 కోట్ల మందికి చౌకైన స్మార్ట్ ఫొన్ల వైపు మళ్ళే దిశగా అడుగులు వేయ వలసిన అవసరం ఉందన్నారు.
5జీ ఫోన్లను కూడా పూర్తి భారతీయ సాంకేతికతనే చౌకగా తయారు చేయగల సత్తా ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు అనువైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టం అవసరం అని అందుకు గూగుల్ తో జత కడుతున్నట్లు తెలిపారు.