భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి తన స్థాయిని చాటుకుంది. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 జాబితాలో రిలయన్స్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 13వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ ఒక్కసారిగా ఎగబాకి ప్రపంచవ్యాప్తంగా టాప్-2 బ్రాండ్‌గా గుర్తింపు సాధించడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా 100 మంది ప్రముఖ కంపెనీల బ్రాండింగ్, మార్కెట్ వృద్ధి రేటును పరిశీలించి ఈ జాబితాను రూపొందిస్తారు. ఈ ఏడాది కొరియన్ దిగ్గజం శాంసంగ్ మొదటి స్థానంలో నిలవగా, రిలయన్స్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతంలో టాప్ ప్లేస్‌లో ఉన్న ఆపిల్ ఈసారి మూడో స్థానానికి పరిమితమైంది.
టాప్ 10 బ్రాండ్స్‌లో నైక్, వాల్ట్ డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టయోటా వంటి దిగ్గజ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అయితే, ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావడం గమనార్హం.
ఇంతటి ఘనత సాధించడం భారత వ్యాపార రంగానికి గర్వకారణంగా మారింది. రిలయన్స్ సాధించిన ఈ విజయం భారతదేశం అంతర్జాతీయ వాణిజ్య విపణిలో ఎంతటి ప్రాధాన్యతను దక్కించుకుందో తెలియజేస్తోంది.