ముంబై: దేశంలో టెలికాం రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరొ సంచలనానికి సిద్ధం అయింది. రిటైల్ విభాగంలో సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోంది.
ఇప్పటికే భారతదేశంలోని 200 నగరాల్లో కిరాణా వస్తువుల డెలివరీ సేవలను ప్రారంభించిన రెండు నెలల తరువాత, జియోమార్ట్ ఇప్పుడు తాజాగా ఆండ్రాయిడ్, ఐఫోన్ల వినియోగదారుల కోసం కొత్త మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. దీని ద్వార జియోమార్ట్ అన్ని ఆర్డర్‌లపై ఉచిత డెలివరీని కూడా అందిస్తోంది.
జూలై 15న కంపెనీ ఆన్ లైన్లో నిర్వహించిన 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ అంబానీ జియోమార్ట్ ముఖ్యమైన ప్రణాళికలను ఆవిష్కరించిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వినియోగదారుల కోసం లాంచ్ చేసిన జియోమార్ట్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని జియో ప్రకటించింది.
రిలయన్స్ తన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ అయిన రిలయన్స్ వన్ ను జియోమార్ట్‌కు కూడా కొనసాగిస్తోంది. తద్వారా వినియోగదారులు అనేక బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేకమైన ఆఫర్‌లతో పాటు, రిలయన్స్ వన్ పాయింట్లను సంపాదించవచ్చని తెలిపింది.
ఐదు శాతం డిస్కౌంట్ కుడా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో ఈయాప్ దూసుకుపోతోంది. ఇప్పటికే 10వేలకు పైగా డౌన్‌లోడ్‌లను ఈ యాప్ నమోదు చేసింది.