ముంబై: రిలయన్స్ జియోమార్ట్, ఆన్లైన్ వ్యాపారాలను వేగంగా విస్తరించడానికి పావులు కదుపుతోంది. తన వ్యాపారాన్ని పెంచుకోవడం కోశం ఇప్పటికే మార్కెట్లో ఉన్న పలు కంపెనీలను పూర్తిగా కొనడానికి లేదా అంతో ఇంతో వాటా కొనుగోలు చేసే పనులను వేగ వంతం చేసింది. ప్రస్తుతానికి జియోమార్ట్ పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్(ఎఫ్‌ఎమ్‌సీజీ) విక్రయిస్తోంది. అతి త్వరలో మరిన్ని విభాగాలు–ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్ జత చేయబోతున్నది.
ఇటీవలే ఫ్యాషన్ స్టార్టప్ అయిన జివామెలో రోనీ స్క్రూవాలకు ఉన్న 15 శాతం వాటాను రిలయన్స్ బ్రాండ్స్ కొనేసింది. అయితే ఈ కంపెనీలో ఇంకా తన వాటాను పెంచుకోవడం కోసం కొనుగోలు యత్నాలు చేస్తోంది. అలాగే ఆన్‌లైన్ ఫర్నీచర్ సంస్థ, అర్బన్ ల్యాడర్‌ను, గ్రోసరీ డెలివరీ సంస్థ మిల్క్ బాస్కెట్‌ను కూడా రిలయన్స్ కొనుగోలు చేయనున్నదని సమాచారం.
దేశంలో నడుస్తున్న పలు ఆన్‌లైన్ సంబంధిత స్టార్టప్‌లను కుదిరితే పూర్తిగా కొనేయడమో లేదంటే ఎంతో కొంత వాటానైనా చేజిక్కించుకోవడమో ఇదే ఇప్పుడు రిలయన్స్ జియోమార్ట్ వ్యవహరిస్తున్న వ్యూహం. గత రెండు నెలల్లో 8.5 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్ రిటైల్ రూ.37,710 కోట్లు సమీకరించింది. జియోమార్ట్ విస్తరణ కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నది.
కాగా ఇటీవల రిలయన్స్‌కు చెందిన జియోమార్ట్ (గ్రోసరీ) మరియు అజియో(దుస్తులు) యాప్‌ల డౌన్‌లోడ్లు రోజూ క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నాయి. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ యాప్‌ల డౌన్‌లోడ్‌ల కంటే రెట్టింపు జియోమార్ట్ యాప్‌ల డౌన్‌లోడ్‌లు జరుగుతున్నాయి. డౌన్‌లోడ్‌లు జోరుగా ఉంటే లావాదేవీలు జరిగినట్లు కానప్పటికీ, భవిష్యత్తులో లావాదేవీలు పెరగడానికి ఈ డౌన్‌లోడ్‌లు ఒక సంకేతమని గోల్డ్‌మన్ శాక్స్ అంటోంది.