హైదరాబాద్: అల్లు అర్జున్‌కు ఊరట: రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కుకున్న అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు నేపథ్యంలో అల్లు అర్జున్‌కు డిసెంబర్ 13న మధ్యంతర బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.
తదుపరి బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు, అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు పరిగణలోకి తీసుకుంది. RTC X రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో నటుడు ప్రత్యక్షంగా పాల్గొనలేదని, కాబట్టి నేరపూరిత నరహత్య ఆరోపణలు వర్తించవని వాదించారు.
డిసెంబర్ 4న సంభవించిన దుర్ఘటన
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో “పుష్ప 2” ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి (35) అనే మహిళ మరణించగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు గాయాలపాలయ్యాడు. దుర్ఘటన అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌తో పాటు ఆయన భద్రతా బృందం, థియేటర్ యాజమాన్యం మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణలో అల్లు అర్జున్ అరెస్ట్
మహిళ మృతిపై భారతీయ న్యాయసంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, డిసెంబర్ 13న అల్లు అర్జున్‌ను A-11గా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో డిసెంబర్ 14న అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాడు.
పరిహారం ప్రకటించిన అల్లు అర్జున్
తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు ఆర్థిక సహాయం అందజేసినట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ మొత్తంలో రూ.1 కోటిని అల్లు అర్జున్ అందించగా, మైత్రీ మూవీస్ మరియు దర్శకుడు సుకుమార్ తలో రూ.50 లక్షలు ఇచ్చారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు ఈ చెక్కులను అందజేశారు.
కొర్టు తీర్పు జనవరి 3న
రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై డిసెంబర్ 27న విచారణ జరిగింది. అయితే పోలీసులు కౌంటర్ దాఖలు చేసేందుకు అదనపు సమయం కోరడంతో, విచారణ డిసెంబర్ 30కి వాయిదా పడింది. చివరగా నాంపల్లి కోర్టు తీర్పు జనవరి 3న వెల్లడించనున్నట్లు నిర్ణయించింది.