హైదరాబాద్ : తెలంగాణ నూతనంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ ఆది నుండి వివాదాలలో చిక్కుకుంటోంది. ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆధార్ వివరాలు తీసేయాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
ధరణి సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ కాలమ్ ను తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ లను నిలిపి వేయాలని, కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ఆదేశించింది. గురువారం ధరణి పోర్టల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ జరిపింది.
తెలంగాణ ప్రభుత్వం గతంలో న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని, తెలివిగా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే అంగీకరించబోమని మరోసారి స్పష్టంగా తెలియజేసింది. రిజిస్ట్రేషన్‌లు యధావిధిగా కొనసాగించాలని చెప్పింది.
కానీ రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ఆధార్ కార్డ్ వివరాలు అడగకూడదని, వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ మినహాయించి ఇతర గుర్తింపు కార్డులను అంగీకరించాలని.. సాఫ్ట్‌వేర్, మ్యానువల్‌లో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల సవరణకు ప్రభుత్వం వారం రోజుల సమయం కోరగా.. హైకోర్టు తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.