చెన్నై: హిందీ తొలగించండి.. తమిళాన్ని ప్రోత్సహించండి అని తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు
తమిళంపై ప్రేమను చేతల్లో చూపించాలి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలని డిమాండ్ చేశారు. హిందీకి బదులుగా తమిళాన్ని (Tamil) అధికార భాషగా చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)కి సూచించారు.
త్రిభాషా విధానంపై స్టాలిన్ విమర్శలు
జాతీయ విద్యా విధానం (NEP) అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. త్రిభాషా విధానం (Three Language Policy)ను తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాలిన్ తన ఎక్స్ (X – Formerly Twitter) ఖాతాలో పోస్టు చేశారు.
హిందీని తొలగించండి – తమిళాన్ని ప్రాధాన్యం ఇవ్వండి
భారతీయ జనతా పార్టీ (BJP) ప్రధాని మోదీకి తమిళ భాషపై అపారమైన ప్రేమ ఉందని చెబుతోందని, అది నిజమే అయితే దాన్ని చేతల్లో చూపాలని స్టాలిన్ అన్నారు. పార్లమెంటులో సెంగోల్ (Sengol) ఏర్పాటు చేయడం కంటే, తమిళనాడు (Tamil Nadu)లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీని తొలగించడమే మోదీ ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు.
తమిళ పేర్లను ప్రోత్సహించండి
రైల్వే ప్రాజెక్టులకు, రైళ్లకు హిందీ పేర్లు పెట్టకుండా తమిళ నామకరణం చేయాలని స్టాలిన్ సూచించారు. అంత్యోదయ (Antyodaya), తేజస్ (Tejas), వందే భారత్ (Vande Bharat) లాంటి పేర్లకు బదులుగా తమిళ భాషలో ప్రత్యేకమైన పేర్లు పెట్టాలని కేంద్రాన్ని కోరారు.
తమిళనాడు గొంతు నొక్కే చర్యలకు వ్యతిరేకం
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై స్టాలిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు 12 పార్లమెంటరీ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని, ఇది రాష్ట్ర గొంతును నొక్కే చర్యగా అభివర్ణించారు. 1971 జనాభా గణాంకాల ప్రకారమే విభజన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ప్రత్యేక పథకాలు, నిధుల కోసం విజ్ఞప్తి
కేంద్ర బడ్జెట్‌లో తిరుక్కురల్ (Thirukkural)ను ప్రస్తావించడం మాత్రమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలు చేయాలని స్టాలిన్ కోరారు. ప్రత్యేక విపత్తు సహాయ నిధి (Disaster Relief Fund) కేటాయించడంతో పాటు, కొత్త రైల్వే ప్రాజెక్టులకు మంజూరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.