న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండవ వేవ్ విరుచుకుపడ్డ సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరు కూడా మరణించలేదని, ఈ మరణాలకు సంబంధించిన నివేదికలేవీ తమకు అందలేదన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ సమాచారం కోసం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
కోవిడ్ సమయంలో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వల్ల ఎవరైన చనిపోయిఉంటే వారి సమాచారం ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ పంపింది. దీనివల్ల పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేలోపే ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సమాచారాన్ని అందించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
దేశంలో రెండవ దశ కరోనా వల్ల ఆక్సిజన్ కొరతతో ఎలాంటి మరణాలు చోటు చేసుకోలేదన్న కేంద్రం ప్రకటనపై ఇటీవల భారీగా విమర్శలు వచ్చాయి. ఈ నెల 20వ తేదీన రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు కోవిడ్ మరణాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక మరణాలను నివేదించలేదని ఆరోగ్యశాఖ సహాయమంత్రి సమాధానం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కసారిగా కేంద్రంపై మండిపడ్డాయి.