అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధమైనంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికా బద్ధంగా ముందుకు తీసుకెల్తోంది.
గడచిన వందేళ్ల చరిత్రలో భారత దేశంలో ఎక్కడా జరగని అతి పెద్ద సర్వేని చేపడుతున్నందున అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చుకుంటోంది. హైబ్రిడ్ మెథడ్‌లో కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అనుకున్న సమయంలో సర్వే క్రతువు పూర్తి చేసేందుకు టైమ్‌లైన్ రూపొందించింది. రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్, సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో రీసర్వేకు నిబంధనావళి రూపొందించాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 17,461 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించి యజమానులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తులను మూడు దశల్లో సర్వే చేయనున్నారు. మూడు దశలో సర్వే ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేస్తారు.