తెలంగాణ: పేదింటి కలలకు రేవంత్ సర్కార్ శుభవార్త!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా పేదలకు ఇళ్లు అందించేందుకు “ఇందిరమ్మ ఇళ్ల” పథకాన్ని త్వరలోనే అమలులోకి తీసుకురానుంది. ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం వారం, పదిరోజుల్లోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇందిరమ్మ ఇళ్ల పథకం
పేదలకు ఇళ్లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ముందడుగులు వేస్తోంది. ఇల్లు లేని వారికి ఈ పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, స్థలం లేనివారికి స్థలం కూడా కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకం మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనుంది, మరుసటి విడతలో స్థలం లేనివారికి అవకాశం కల్పించనుంది.
ప్రధానమంత్రి ఆవాస యోజనతో అనుసంధానం
కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) పథకానికి అనుసంధానించాలని నిర్ణయించింది. దీంతో పథకానికి అదనంగా కేంద్రం నుంచి సుమారు రూ.4,600 కోట్ల నిధులు అందుతాయని అంచనా.
రెండు విడతల్లో ఇళ్ల కేటాయింపు
ప్రస్తుతం దాదాపు 82 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. పట్టణ ప్రాంతాల్లో 23.5 లక్షల దరఖాస్తులు, గ్రామీణ ప్రాంతాల్లో 58.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో తొలి విడతలో 4,16,500 ఇళ్లు కేటాయించనున్నారు. అదనంగా రిజర్వ్ కోటా కింద మరో 33,500 ఇండ్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించనుంది.
బడ్జెట్ కేటాయింపు
ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9,184 కోట్ల బడ్జెట్ కేటాయించింది. పీఎంఏవై పథకం ద్వారా మరో రూ.4,600 కోట్లు కేంద్రం నుంచి అందుకోనుంది. ఈ విధంగా పేదలకు ఇళ్ల కలను సాకారం చేయడానికి ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను సిద్ధం చేసింది.
మహిళలు, రైతులకు హామీలు నెరవేర్చిన సర్కార్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత కరెంట్ వంటి పథకాలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసింది. అలాగే, రైతులకు రుణమాఫీని కూడా పూర్తి చేసింది.