తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలో తనకు బాగా తెలుసునని మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. తాను ఫుట్‌బాల్ ప్లేయర్ ని అంటూ, రాజకీయాల్లోనూ అదే చైతన్యం, స్పూర్తితో పనిచేస్తున్నానని పరోక్షంగా తెలిపారు.
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే ముఖ్యమంత్రి పీఠం చేపట్టానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పనులను సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామంటూ రేవంత్ రెడ్డి వివరించారు. గతంలో నెలకు జీతాలు ఎప్పుడు వస్తాయో ఉద్యోగులకు తెలియనివిధంగా ఉండేదని, తమ ప్రభుత్వంలో మాత్రం మొదటి తేదీన వేతనాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులలో మూసీ నది ప్రక్షాళనను ప్రాధాన్యతగా చేపట్టామని, ఏ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఆక్రమణలు తొలగిస్తున్నామని తెలియజేశారు. ఇక హైడ్రా ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, “రియల్ ఎస్టేట్ పడిపోతుందనేవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో,” అని ప్రశ్నించారు.
తమ హయాంలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి 2 లక్షల ఎకరాలకు పెరిగిందని అన్నారు. కేటీఆర్‌కు మూసీ ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. తాము తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రానికి పేరు, ఆదాయం తెస్తాయన్నదే తమ లక్ష్యమని చెప్పారు.