తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాది విజయవంతంగా పూర్తిచేసుకుంటున్న వేళ, రేవంత్ తన అధికార నడతలో కేసీఆర్‌ను అనుకరిస్తున్నారా? అనే ప్రశ్న ప్రాధాన్యం సంతరించుకుంది.
ముఖ్యంగా, సొంత పార్టీ నేతలతో దూరంగా ఉండడం, అపాయింట్‌మెంట్‌ల విషయంలో ఆలస్యం చేయడం వంటి అంశాలు ఇదే సంకేతాలిస్తున్నాయి.
కేసీఆర్ పాలనలో కనిపించిన అధికార ప్రాధాన్యతను రేవంత్ కూడా అనుసరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు రేవంత్‌ను కలవడానికి తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారట.
అపాయింట్‌మెంట్‌ల కోసం రోజులు తరబడి వేచి చూడాల్సి రావడం, నిర్లక్ష్యానికి గురవుతుండటం వంటి ఫిర్యాదులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
ప్రస్తుతం విపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శలకు సమర్థవంతమైన ప్రతిస్పందన ఇచ్చే టీంను సిద్ధం చేయడంలో రేవంత్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
పార్టీ కోసం మరింత సమర్ధవంతమైన వ్యవస్థను నిర్మించకుండా ఉండటం, ఈ పరిస్థితిని మరింత క్షీణించేందుకు దారితీస్తుందని వారన్నారు.