తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ను వరదల నుండి రక్షించాలని కృషి చేస్తున్నప్పటికీ, విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. హైడ్రా, మూసీ ప్రాజెక్టులపై వస్తున్న విమర్శలను ఎదుర్కొనే క్రమంలో రేవంత్ కీలక నేతల అక్రమ కట్టడాల జాబితాను బహిర్గతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఔటర్ రింగ్ రోడ్డులోని చెరువులను కబ్జా చేసిన రాజకీయ నాయకులు, రియల్టర్లు, వ్యాపారవేత్తల పేర్లను ఈ జాబితాలో చేర్చారని తెలుస్తోంది. 2014 తర్వాత 171 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, వాటిలో 44 చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది.
మరికొన్ని చెరువుల్లో వెంచర్లు, ఫాంహౌజ్‌లు నిర్మించినట్లు సమాచారం. రేవంత్, ఈ అక్రమాలను నిరూపించడానికి అన్ని శాఖల నుంచి సంబంధిత పత్రాలు సేకరించారని సమాచారం.
అయితే, హైడ్రా ప్రాజెక్టు అమలులో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటపెట్టాలనే రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తమ పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తున్న విపక్షాలకు ఈ జాబితా ద్వారా గట్టి సమాధానం ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కీలక ప్లాన్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆ జాబితా విడుదలైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త కలకలం రేగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.