హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 16న ఢిల్లీకి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది.
సీఎం తో పాటు రాష్ట్ర డెప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్తారని సమాచారం.
ఇంకా ఇతర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు శ్రీధర్ బాబు కూడా వారితో పాటుగా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ సారి హస్తిన పర్యటనలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపైనే ఎక్కువగా చర్చించే అవకాశాలు ఉన్నాయి.
దీనితో పాటుగా పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ, మరియు మిగిలిన పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు.
అయితే అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవి మరియు కేబినెట్ విస్తరణ వంటి కీలకమైన అంశాలపైన చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది.
ఈ కసరత్తు నేపథ్యంలో ఇటీవలనే పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తి చేశారు.
అయితే సామాజిక సమీకరణాల విషయంలో అందరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల కేబినెట్ విస్తరణ చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది.