తెలంగాణ: ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రాంతానికి తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని వెల్లడిస్తూ, ఇది రాణి రుద్రమదేవి, సమ్మక్క-సారలమ్మ వంటి వీరనారీమణుల పాలన చూసిన గడ్డ అని కొనియాడారు.
మామునూరు ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తామనే హామీని నిలబెడుతున్నామని చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, డిస్కంలకు ఉచిత కరెంట్ పేరుతో భారీ బకాయిలు మిగిల్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్లు అందిస్తోందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉన్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదని స్పష్టం చేశారు.
కడియం శ్రీహరి నిజమైన ప్రజానాయకుడు అని ప్రశంసిస్తూ, కడియం కావ్యను ఎంపీగా గెలిపిస్తే వరంగల్‌కు ఎయిర్‌పోర్టు, ఖాజీపేటకు రైల్వే డివిజన్ తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినా మూడేళ్లూ నిలబడలేదని, ఇది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ అభివృద్ధి ప్రాజెక్టులపై కేసీఆర్ చర్చకు సిద్ధమేనా? అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.