తెలంగాణ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మైనార్టీలకు రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి తీవ్ర విమర్శలు చేశారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది, కానీ ప్రధాని మోదీ వాటిని రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు,” అని ఆరోపించారు.
రెవంత్ మాట్లాడుతూ, “మెజార్టీ, మైనార్టీ ప్రజలందరూ తమ ప్రభుత్వానికి రెండు కళ్లుగా ఉంటారు. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మౌలానా ఆజాద్‌ను విద్యాశాఖ మంత్రిగా నియమించినది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆజాద్ విద్యా వ్యవస్థలో ఎన్నో కొత్త విధానాలను తీసుకువచ్చారు,” అని వివరించారు.
మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని, తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిందని, నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి మైనార్టీలకు కేటాయించినట్లు వెల్లడించారు.
దేశంలో రెండు వర్గాలున్నాయని, ఒకటి మోదీ వర్గం కాగా, రెండోది గాంధీ వర్గమని, “హిందూ, ముస్లిం భాయి భాయి అన్నదే తమ విధానం” అని అన్నారు. చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని, రాహుల్ గాంధీ కూడా అదే జాడల్లో నడుస్తున్నారని గుర్తుచేశారు.