కరోనా, లాక్ డౌన్, థియేటర్స్ మూసివేత వల్ల షూటింగ్స్ ఆగిపోగా షూటింగ్స్ కంప్లీట్ అయిన సినిమాలు కూడా ఎలా విడుదల చెయ్యాలి అని నిర్మాతలు తలలు పట్టుకుంటుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం సినిమాల మీద సినిమాలు పూర్తి చేసి ఓటీటీల్లో వదులుతున్నారు. ఇప్పుడు 12’o Clock అని మరో హర్రర్ సినిమా ప్రకటించి ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఆయన ‘క్లైమాక్స్’, ‘నేకేడ్’ చిత్రాలను ఈ లాక్ డౌన్ కాలంలో నిర్మించి, విడుదల చేయడం కూడా జరిగిపోయింది, మరొక సినిమా కరోనా వైరస్ కూడా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. హారర్ సినిమాలు ప్రేక్షకుల ఆలోచన స్థాయి తో వాళ్లనే బయపెట్టేవిగా ఉంటాయని, ఈ టెక్నిక్ తోనే తాను ఇదివరకు ‘రాత్’ , ‘భూత్’ లాంటి సినిమాలు తీసి విజయవంతం అయ్యాడని చెప్పారు.
ఈ సినిమాతో ఎం ఎం కీరవాణి తో క్షణ క్షణం తర్వాత మళ్ళీ ఇప్పుడు పని చేస్తున్నానని, ఎం ఎం కీరవాణికి ఇది మొదటి హారర్ సినిమా అని చెప్పుకొచ్చారు. సినిమాలో మిథున్ చక్రవర్తి, ఆశిష్ విద్యార్ధి ముఖ్యమైన పాత్రలు చేసినట్టు తెలుస్తుంది. ‘ఎక్కడో ఆత్మలకి , సైన్స్ కి మధ్యలో భయం చాలా బలంగా ఉంటుంది’ అనే పదాలతో మొదలయిన ఈ సినిమా ట్రైలర్లో పెద్దగా చెప్పుకోదగ్గ విశేషాలేమి లేవు. తన పాత సినిమాలోని సీన్స్ నే కొత్త సౌండ్స్ జోడించి, కొత్త క్యారెక్టర్స్ తో కొత్త టైటిల్ లో తీసినట్లు అనిపిస్తుంది. సినిమాలో కంటెంట్ లేకపోయినప్పటికీ తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ, వివాదాలతో ప్రమోషన్స్ చేస్తూ ఈ కరోనా సమయం లో కూడా రామ్ గోపాల్ వర్మ లాభాల్లో నడుస్తున్నాడు.