హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స అందించడానికి డాక్టర్లు, నర్సులు బయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రోగులకు చికిత్స ఇస్తూ పలువురు డాక్టర్లు, నర్సులు కరోనా బారిన పడి మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
సాధారణ ప్రజలకంటే వైద్య సిబ్బందే వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో రోగులకు వైద్యం చేయడానికి జంకుతున్నారు. ఈ సవాల్ ను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది ప్రభుత్వం. ఐతే వైరస్ విజృంభించిన సమయంలో చైనా రోబోలను వినియోగించింది.
రోబోలను ఉపయోగించడం వల్ల రోగికి, వైద్య సిబ్బందికి మధ్య దూరాన్ని పాటించే అవకాశం ఉంటుంది. రోగికి జ్వరం చూడడం, మందులు ఇవ్వడం లాంటి పనులన్నీ రోబోలు చేస్తే వైద్యులకు వైరస్ సోకే అవకాశాలు అతి తక్కువగా ఉంటాయి.
రోగి ఇబ్బందులను కూడా రోబోనే తెలుసుకునే వీలుంది. తద్వారా నర్సు ఇచ్చే ఆదేశాలను రోబో పాటించి ఆ మేరకు రోగికి సేవలు చేస్తుంది. అలా రోబోకు రిమోట్ ద్వారా ఆదేశాలిస్తూ కరోనా రోగులకు సేవలు చేసే వీలు ఏర్పడింది. కేరళలో మాస్క్‌లు, శానిటైజర్ల పంపిణీకి హ్యూమనాయిడ్ రోబోలను ఉపయోగించారు.
అలాగే కొచ్చికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించడానికి ఒక రోబోను అభివృద్ధి చేసింది. 3 చక్రాల రోబో ఆహారం, వైద్య, క్లినికల్ వినియోగ వస్తువులను తీసుకెళ్ళగలదు. దీన్ని ప్రధానంగా ఐసోలేషన్ వార్డుల్లో ఉపయోగించుకునేలా రూపొందించారు. వీడియో కాలింగ్ ద్వారా వైద్యులు లేదా బంధువులు రోగులతో మాట్లాడేలా దీన్ని తయారు చేశారు.