తిరుమల: టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు మృతి చెందిన ఘటనపై రాజకీయ ఉద్రిక్తత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మీకు, మీ అన్నకు పదవులు, ప్యాకేజీలు దక్కితే నోరు పెగలదా?” అంటూ ప్రశ్నించారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై మౌనం ఎందుకని రోజా నిలదీశారు. గోమాతను పూజించే ధర్మంలో గోవుల మరణంపై స్పందించకపోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు.
గోశాలలో జరిగినదాన్ని వెలికితీసిన భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెట్టడం దారుణమని తెలిపారు. గోశాల పరిస్థితిని బయటపెట్టినందుకు భూమనపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారన్నారు.
రోడ్డుపై భూమనతో కలిసి నిరసనలో పాల్గొన్న రోజా, “గోశాలకు ఒంటరిగా రమ్మంటే వస్తాం, అందరినీ రమ్మంటేనూ వస్తాం,” అని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ ఏడు కొండల మెట్లను కడగాలని రోజా విరుచుకుపడ్డారు. కూటమి తప్పులకు పవన్ కూడా బాధ్యత వహించాలన్నారు. తిరుమల విషయంలో దేవుడితో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుసని, పవన్‌కి ఇప్పుడు అర్థమవుతోందని అన్నారు.