అబుదాబి: చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్‌లో ఒక అద్భుతమైన జట్టు, ఈ జట్టుతో మ్యాచ్ అంటే దాదాపు వన్ సైడ్ గేం అనే పేరు కూదా ఉంది, ఆడిన 10 ఐపీఎల్లోనూ ప్లే ఆఫ్ చేసిన అరుదైన రికార్డు ఉన్న ఈ జట్టు, ఈసారి ప్లే ఆఫ్ చేరడం పై ఆశలు వదులుకున్నట్లే! ఈ సీజన్ మొత్తం తడబడుతూనే వస్తున్న ఈ మాజీ చాంపియన్ ఏడో పరాజయంతో తమ ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రవీంద్ర జడేజా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎమ్మెస్ ధోని (28 బంతుల్లో 28; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
అనంతరం రాజస్తాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జాస్ బట్లర్ (48 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (34 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి జట్టును విజయతీరం చేర్చారు.
ఐపీఎల్‌లో ధోని 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇందులో 170 మ్యాచ్‌లు చెన్నై తరఫున ఆడగా… చెన్నై నిషేధానికి గురైన రెండేళ్లలో పుణే సూపర్ జెయింట్స్ తరఫున మరో 30 మ్యాచ్‌లు ఆడాడు. లీగ్‌లో ధోని మొత్తం 4,596 పరుగులు సాధించగా… తాజా మ్యాచ్‌తో ఒక్క సీఎస్‌కే తరఫునే ధోని ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మైలురాయిని (మొత్తం 4,022) కూడా దాటాడు.