తెలంగాణ: అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతల నిరసనలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేట్ వద్ద నిరసనకు దిగారు. ముఖ్యంగా, రేవంత్ రెడ్డి మరియు అదానీ సంబంధాలపై వారు తీవ్ర విమర్శలు చేశారు.
నిరసనలో భాగంగా ప్రత్యేకంగా ముద్రించిన టీ షర్ట్‌లు ధరించి సభలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
పోలీసులు బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ గేట్ వద్దనే అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. టీ షర్ట్‌లు ధరించి సభలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది స్థానికంగా ఘర్షణల వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఈ పరిణామాల మధ్య కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్కడ నిర్బంధంలో ఉంచినట్లు సమాచారం.
అసెంబ్లీ సమీపంలో బీఆర్ఎస్ కార్యకర్తల పెద్ద ఎత్తున హాజరు కావడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
తెలంగాణ రాజకీయ వేదికపై తాజా పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా పెంచుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు సాగడం, బీఆర్ఎస్ నిరసనలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారాయా? అనే చర్చ కొనసాగుతోంది.