ముంబై: డాలర్ పతనం ఇంకా కొనసాగుతోంది. తాజాగా 33 పైసలు కోల్పోయి 74.40 దగ్గర ఆగింది. ఆర్థిక రికవరీ సంకేతాలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ మార్చికల్లా జోరందుకోగలదని రీసెర్చ్ సంస్థ నోమురా హోల్డింగ్స్ అంచనా వేసింది. వెరసి డాలరుతో మారకంలో రూపాయి తిరిగి కోవిడ్-19కు ముందు స్థాయి 72కు చేరుకోగలదని అభిప్రాయపడింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రూపాయి 72 స్థాయిలో ట్రేడయ్యింది. ఇందుకు 2004 తదుపరి కరెంట్ ఖాతాలోటు నుంచి బయటపడటంతో పాటు మిగులుదిశగా పయనించడాన్ని ప్రస్తావించింది. ఇటీవల చమురు ధరలు పతనంకావడం, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితులు మెరుగుపడటం రూపాయికి బలాన్నివ్వగలవని పేర్కొంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహాయ ప్యాకేజీ ప్రకటన, పసిడి, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో తాజాగా దేశీ కరెన్సీ కాస్త వెనకడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 33 పైసలు (0.4 శాతం) కోల్పోయి 74.70ను తాకింది.
ఇది రెండు నెలల కనిష్టం కాగా, తొలుత 7 పైసలు తక్కువగా 74.44 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి మరింత క్షీణించింది. బుధవారం కన్సాలిడేషన్ బాటలో సాగిన రూపాయి 74.37 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి 4.2 శాతం నష్టపోవడం గమనార్హం!