విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవంతిని సినిమా షూటింగ్‌లకు స్పాట్‌గా మార్చే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వైసీపీ హయాంలో భారీ నిర్మాణాలతో రూపుదిద్దుకున్న రుషికొండ ఇప్పుడు వ్యయప్రయాసలకే సాక్షిగా నిలిచింది.
మొత్తం 500 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై కోర్టుల్లో, హరిత ట్రైబ్యునల్‌లో కేసులు నడుస్తున్నాయి.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుషికొండను పర్యటించి, భవిష్యత్‌లో ఈ భవంతిని ఎలా ఉపయోగించాలన్న అంశంపై ప్రభుత్వ కసరత్తు మొదలైంది. పలు సూచనలు వచ్చినప్పటికీ, ప్రభుత్వం రుషికొండను సినిమా షూటింగ్ స్పాట్‌గా ఉపయోగించడాన్ని పరిశీలిస్తోంది.
దీనికి సంబంధించిన వ్యవహారాలను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. రుషికొండను సినిమాల షూటింగ్‌లకు అందుబాటులోకి తేవడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, విశాఖలో సినీ కార్యకలాపాలు పుంజుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సినిమా షూటింగ్‌ల ద్వారా ఈ ప్రాంతానికి వచ్చిన పాపులారిటీతోపాటు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. రుషికొండకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఈ ప్రాజెక్టు మార్పిడి జరిగితే, భవిష్యత్తులో ఇదే రూట్‌లో మరిన్ని సినిమాలు, కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది.