మాస్కో: కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న ప్రపంచానికి ఇదో ఊరటనిచ్చే వార్త! రష్యాలో తొలి కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క క్లీనికల్ ట్రయల్స్ పూర్తి అవడం అనేది ఈ వైరస్ పై గెలుపుకు తొలి అడుగు. ఈ క్లీనికల్ ట్రయల్స్ కరోనాను తరిమి కొట్టగలమన్న ధైర్యాన్ని ఇప్పుడు ప్రపంచానికి తెలియజేసింది.
రష్యాకు చెందిన సెచెనోవ్ వైద్య విశ్వవిద్యాలయం చేసిన ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌లేషన్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాదిమ్ తారాసోవ్ తెలిపారు. జూన్ 18న ఈ వ్యాక్సిన్ కి సంబంధించిన క్లీనికల్ ట్రయల్స్ ను మొదలుపెట్టింది గమలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయోలజీ.
ఈ ట్రయల్స్ ను రెండు బృందాలపై జరిపినట్లు తెలిపారు. ఈ బృందంలోని తొలి వాలంటీర్లను 15వ తేదీన, రెండో బ్రందంలోని వాలంటీర్లను 20వ తేదీన డిస్చార్జ్ చేయనున్నట్లు తారాసోవ్ తెలిపారు.
టీకా భద్రత పరీక్షలు కూడా నిర్వహించారని అవి కూడా విజయవంతగా పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసైటాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషేవ్ తెలిపారు. వ్యాక్సిన్ భద్రత పరీక్షలు కూడా పూర్తి కావడంతో ఇక సెచెనోవ్ యూనివర్సిటీ ఈ వ్యాక్సిన్ అభివృద్ధిపై దృష్టి సారించనుంది అని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
లండన్ కు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పురోగతి దశలో ఉందని డబ్లూహెచ్వో గత వారంలో తెలిపింది. ఆ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ లో ఉంది. కాని అద్భుత రీతిలో రష్యా ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను జరిపి ప్రపంచానికే ఆశలు రేపింది.