మాస్కో: రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో రష్యా తన ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ వన్‌వెబ్ తెలిపింది. రష్యా కజికిస్తాన్ నుంచి చేసే అన్ని ఉపగ్రహ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్టుగా బ్రిటన్ శాటిలైట్ కంపెనీ ప్రకటన చేసింది.
ఇంకోవైపు రష్యా తమ దేశ అంతరిక్ష రాకెట్ అయిన సూయజ్ నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను తొలగించింది. అయితే భారత దేశ జెండాను మాత్రం తీయకుండా అలాగే ఉంచింది. రష్యా అంతరిక్ష ఏజెన్సీ చీఫ్ ద్విమిత్రి రోగోజిన్ దీనికి సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
తన వీడియోలో కొన్ని దేశాల జెండాలు తీసేసిన తరువాత తమ నౌక ఇంతకుముందు అందంగా కనిపిస్తోందని అన్నారు. మరోవైపు అమెరికాకు రాకెట్ ఇంజన్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టుగా రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు అగ్రరాజ్యం ఆర్థిక ఆంక్షలు విధించడంతో దానికి ప్రతిగా రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ పరిస్థితుల్లో రాకెట్ ఇంజిన్లను అమెరికాకు పంపిణీ చేయలేమని ఆ దేశ అంతరిక్ష ఏజెన్సీ చీఫ్ ద్విమిత్రి రోగోజిన్ చెప్పారు. అమెరికా తాను తయారు చేసే చీపురు కట్టలపై ఎగరాలంటూ ఎగతాళి చేశారు. 1990 నుంచి ఇప్పటివరకు రష్యా 122ఆర్‌డీ–180 ఇంజన్లను అగ్రరాజ్యానికి పంపిణీ చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ ఇంజన్ల సర్వీసును కూడా నిలిపివేస్తున్నట్టుగా రోగోజిన్ స్పష్టం చేశారు.