అంతర్జాతీయం: ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న రష్యా, ఉత్తర కొరియా మధ్య మరింత బలమైన రక్షణ ఒప్పందం కుదిరింది. జూన్‌లోనే రష్యా-ఉత్తర కొరియా మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకోగా, దీనిని రష్యా దిగువ సభ, ఎగువ సభల ఆమోదం పొందింది. ఈ ఒప్పందంపై ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న ఉత్తర కొరియా, ఇప్పటివరకు వేలాదిమంది సైనికులను రష్యా మద్దతు కోసం పంపినట్లు తెలుస్తోంది. రష్యా, ఉత్తర కొరియా మధ్య తాజా రక్షణ ఒప్పందం ఈ రెండు దేశాలు పరస్పర సహాయ సహకారం చేసుకునే విధంగా ఉంటుందని, తమపై దాడి జరిగితే పరస్పరం రక్షణా చర్యలు చేపడతారని పుతిన్, కిమ్ స్పష్టం చేశారు.
పాశ్చాత్య దేశాల ఆందోళన
ఈ స్నేహబంధం పాశ్చాత్య దేశాలలో గుబులు పెంచుతుంది. ఉత్తర కొరియా రష్యాకు అధునాతన ఆయుధాలను కూడా సరఫరా చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్ ఫోరెన్సిక్ నిపుణులు రష్యా ఆక్రమణ ప్రదేశాల్లో ఉత్తర కొరియా ఆయుధాలను కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికా, మిత్రదేశాలు రష్యా-ఉత్తర కొరియా మధ్య రక్షణ ఒప్పందంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కిమ్ సేనల యుద్ధ రంగ ప్రవేశం
కిమ్ సేనలు తూర్పు రష్యాలో శిక్షణ పొందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. 11 వేల మంది ఉత్తర కొరియా సైనికులు ఈ యుద్ధంలో రష్యాకు మద్దతుగా వాచినట్టు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా అధికారిక ధ్రువీకరణ లేకపోయినా, పాశ్చాత్య దేశాలు రష్యా-ఉత్తర కొరియా రక్షణ భాగస్వామ్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దాని మిత్రదేశాల సైనిక సహకారం పెరుగుతుండటంతో రష్యా-కిమ్ స్నేహం మరింత పటిష్టమవుతోంది.