కీవ్: దాదాపు గత నెల రోజులగా చేస్తున్న యుద్ధంలో సాధించిందేమీ లేదన్న నిస్పృహతో రష్యా రోజురోజుకీ మరింత హేయంగా ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. ఇప్పటికే నిర్బంధంతో అల్లాడిపోతున్న మారియుపోల్ నగరానికి బుధవారం ఆహారం తదితర అత్యవసరాలను తీసుకెళ్తున్న హ్యుమానిటేరియన్ కాన్వాయ్‌ని, 15 మంది రెస్క్యూ వర్కర్లను రష్యా సైన్యం నిర్బంధించిందని ఉక్రెయిన్ చెబుతోంది.
యుద్ధం నేపథ్యంలో ఇరుపక్షాలూ అంగీకరించిన మానవీయ కారిడార్లను గౌరవించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యపై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. నగరంపై భూ, గగనతల దాడులకు తోడు నావికా దాడులను కూదా రష్యా మొదలు పెట్టింది.
అజోవ్ సముద్రం నుంచి ఏడు యుద్ధ నౌకల ద్వారా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజులుగా ఐదు సెకన్లకు ఒక బాంబు చొప్పున పడుతున్నట్టు నగరం నుంచి బయటపడ్డవారు తెలిపారు. కీవ్‌పైన కూడా రష్యా దాడుల తీవ్రత బుధవారం మరింత పెరిగింది. నగరం మరియు నగర శివార్లలో ఎటు చూసినా బాంబు, క్షిపణి దాడులు, నేలమట్టమైన నిర్మాణాలు, పొగ తప్ప మరేమీ కన్పించని పరిస్థితి.