హైదరాబాద్: రష్యా ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు హైదరాబాద్ కు వచ్చేశాయి. హైదరాబాద్ విమానాశ్రయానికి ఇవాళ సాయంత్రం వ్యాక్సిన్ కంటైనర్లు వచ్చి చేరాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్‌ఏసీ)కు రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల మొదటి ప్రధాన కన్‌సైన్మెంట్ చేరింది. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఇది ముఖ్యమైన మైలురాయి.
కాగా ఈ వ్యాక్సిన్ ను ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ రష్యా నుంచి ఒక ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ విమానంలో తెప్పించింది. ఈ విమానం ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారీ ప్రదేశంగా హైదరాబాద్‌కున్న ప్రత్యేక స్థానం దృష్ట్యా, వ్యాక్సిన్ల సంఖ్యలో పెరుగుదలకు అనుగుణంగా జీహెచ్‌ఏసీ అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది.
స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. వీటిని మైనస్ 20 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం జీహెచ్‌ఏసీ- డాక్టర్ రెడ్డీస్ సప్లై చైన్ బృందం, కస్టమ్స్ విభాగం, ఎయిర్ కార్గోకు చెందిన నిపుణులతో కలిసి పని చేస్తోంది. స్పుత్నిక్ వి కన్‌సైన్మెంట్‌ను సజావుగా నిర్వహించడానికి హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7.5 టన్నుల వ్యాక్సిన్ తెలంగాణకు చేరుకుంది. మొత్తం లక్షా 50 వేల డోసుల వ్యాక్సిన్ హైదరాబాద్ చేరింది.