అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా నెలకొల్పిన గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించిన ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు గురువారం వివిధ శాఖాధిపతులతో సమావేశం నిర్వహిస్తోంది.
ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అయిన ఐఏఎస్ అజయ్‌జైన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, సీసీఎల్‌ఏ, మహిళా శిశు సంక్షేమ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, సాంఘిక సంక్షేమ శాఖల కమిషనర్లు మరియు డైరెక్టర్లు సమావేశంలో పాల్గొననున్నారు.
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ జరగని రీతిలో కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలో కొత్తగా 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి అప్పటికప్పుడే వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కసరత్తు ప్రారంభించడం శుభపరిణామమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య పేర్కొంది.