హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగకు నేడు ముగింపు ఘట్టం. రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి, సాంప్రదాయ పాటలతో పండుగను జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ పండుగలో నేడు చివరి రోజు, కాగా సద్దుల బతుకమ్మ పర్వదినం వేడుకను ఘనంగా నిర్వహించడానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ ఈ వేడుకలకు కేంద్రంగా నిలవనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక స్థూపం నుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో 10 వేల మంది మహిళలు పాల్గొననుండగా, వందలాది కళాకారులు తమ కళారూపాలతో పాల్గొంటారు. బతుకమ్మలతో కూడిన ర్యాలీతో పాటు కళారూపాలు కూడా ప్రజలను అలరించబోతున్నాయి.
ఈ సందర్భంలోనే ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్క్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్స్, లేజర్ షోలు కూడా జరగనున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ప్రజాప్రతినిధులు హాజరై బతుకమ్మ వేడుకలను వీక్షిస్తారు. అలాగే, బతుకమ్మల నిమజ్జనానికి ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులకు సూచనలు ఇచ్చారు.
సద్దుల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమరవీరుల స్మారక స్థూపం నుంచి ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రయాణికులు ఇతర మార్గాల్లో వెళ్లాలని, ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నట్లు సూచించారు.