ఆంధ్రప్రదేశ్: సాయిరెడ్డి ఇకనైనా నిజాలు చెప్పాలి: షర్మిల కీలక వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. శనివారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె జగన్ విశ్వసనీయత కోల్పోయారని, అందుకే అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి కూడా పార్టీ నుంచి వైదొలిగారని అభిప్రాయపడ్డారు.
‘‘విజయసాయి.. జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్ ఏ పని ఆదేశిస్తే అది చేయడం, ఎవరిని తిట్టమంటే వాళ్లను తిట్టడం అతని పని. రాజకీయంగా కాదు.. వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయిరెడ్డి. ఈ అబద్ధాలు జగన్ చెబితేనే అతను చెప్పారు. ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదు అని పేర్కొన్నారు.
వైకాపా కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయండి. జగన్.. విజయసాయిని వదిలేశారంటే ఎందుకు? సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు బయటకు వెళ్తున్నారు? ప్రాణం పెట్టిన వాళ్లు ఎందుకు జగన్‌ను వీడుతున్నారు? జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకుడిగా ప్రజలను, నమ్ముకున్న వాళ్లను మోసం చేశారు. నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేకపోతున్నారు. జగన్ భాజపాకు దత్తపుత్రుడు. సాయిరెడ్డి బయటకు వచ్చారు.. నిజాలు చెప్పాలి. గతంలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలని మీకు తెలుసు. వివేకా హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషం. మిగతా విషయాలు కూడా బయటపెట్టాలి’’ అని షర్మిల అన్నారు.