ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడిచేసిన ఘటన ముంబై నగరాన్ని కలిచివేసింది.
ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో, సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు చోరీ ప్రయత్నం చేస్తుండగా, ఆపేందుకు ప్రయత్నించిన సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు, గాయాలు ప్రాణాంతకమైనవి కావని వైద్యులు తెలిపారు.
పోలీసులు సైఫ్ ఇంటి వద్ద ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. దుండగుడి కోసం ముంబై పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన బాలీవుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.