న్యూఢిల్లీ: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిసింది. సోమవారం నిర్వహించిన మూడో టెస్టులో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది. నేటి నుంచి(మంగళవారం) థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్-1000 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సైనా కరోనా బారిన పడటం ఆందోళన కరంగా మారింది.
ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి సైనా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నిర్వాహకులు ముందస్తు చర్యల్లో భాగంగా పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులకు పరీక్షలను నిర్వహించారు ఈ పరీక్షల్లో సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తొలి రౌండ్‌లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది.
కాగా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్ ప్రణయ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. జనవరి 6న గ్రీన్ జోన్ క్వారంటైన్‌లో పాల్గొన్న మొత్తం 824 మంది కోవిడ్ నెగిటివ్‌గా పరీక్షించారు. వీరిలో ఆటగాళ్లు, అంపైర్లు, లైన్ జడ్జీలు, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యుఎఫ్), బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్, వైద్య సిబ్బంది, టీవీ ప్రొడక్షన్ సిబ్బంది ఉన్నారు.
ఇదిలా ఉండగా అంతర్జాతీయ గ్రీన్ జోన్ క్వారంటైన్‌లో పాల్గొనే వారందరూ బ్యాంకాక్‌కు బయలుదేరే ముందు తమ దేశంలోనే కరోనా నెగటీవ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని బీడబ్ల్యూఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు బ్యాంకాక్‌కు చేరుకున్న తర్వాత కూడామళ్లీ మళ్లీ కరోనా టెస్టు చేయించుకున్నారని తెలిపింది.