హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడేళ్లుగా బదిలీలు జరగలేదు, అధికారులు పదోన్నతులు పొందినప్పటికీ పాత స్థానాల్లోనే పనిచేస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.
తెలంగాణ సైబరాబాద్‌కు గత మూడేళ్ళుగా కమిషనర్‌గా పని చేస్తున్న వీసీ సజ్జనార్‌కు అదనపు డీజీగా పదోన్నతి కల్పించి టీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయనతో పాటుగా పశ్చిమ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ నూతన కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.
హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ (ట్రాఫిక్)గా పనిచేస్తున్న డాక్టర్ అనిల్‌కుమార్‌ను మంగళవారం రాష్ట్ర నిఘా విభాగం అధిపతి (ఇంటెలిజెన్స్)గా అదనపు డీజీ హోదాలో నియమించిన నేపథ్యంలో ఆయన స్థానంలో తాత్కాలికంగా ఇన్‌చార్జి హోదాలో డీఎస్ చౌహాన్‌ను ప్రభుత్వం నియమించింది. ఎస్పీల నుంచి డీఐజీలుగా పదోన్నతి పొందినవారు, డీఐజీ నుంచి ఐజీలుగా పదోన్నతి పొందిన మరికొందరు సీనియర్ ఐపీఎస్‌లకు కూడా త్వరలోనే కొత్త పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా సైబరాబాద్ కు సీపీగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో వీసీ సజ్జనార్ చాలా సంచనాలకు చిరునామాగా మారారు. అన్నింటికంటే అతి ముఖ్యమైన ‘దిశ’పై గ్యాంగ్‌రేప్, హత్యకు పాల్పడిన నిందితులను సజ్జనార్ పోలీసు బృందం ఎన్‌కౌంటర్ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. అలాగే సైబరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే కమిషనరేట్‌లో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
కరోనా లాక్‌డౌన్ మొదట్లో హైదరాబాద్‌లోని ఇతర రాష్ట్రాల కార్మికులను సొంత ఊళ్లకు తరలించడంలో కూడా ఆయన చాలా కీలకపాత్ర పోషించారు. తాజాగా సజ్జనార్ నూతన బాధ్యతలు చేపట్టనున్న ఆర్టీసీ ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతోపాటు అసలు దాని మనుగడే అనుమానంగా ఉన్న తరుణంలో ఆయన వీసీ అండ్ ఎండీగా ఆర్టీసీ ని ఏ విధంగా బయటపడేస్తారన్న అంశం ఇప్పుడు సర్వత్రా అసక్తి నెలకొంది.