జాతీయం: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మళ్లీ వరుస బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన సల్మాన్ ఖాన్ తన భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో ఆయన రూ.2 కోట్ల విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ కారును దుబాయ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ కొత్త కారు సల్మాన్ ఖాన్ గ్యారేజ్‌లో త్వరలోనే చేరనుంది.
బిగ్ బాస్ సెట్స్‌లో భద్రత కట్టుదిట్టం
సల్మాన్ ఖాన్ భద్రత కోసం ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోగా, తాజాగా ఆయన బిగ్ బాస్ షో షూట్‌లో పాల్గొన్నప్పుడు దాదాపు 60 మంది సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించారు. 2023 ఏప్రిల్ నెలలో సల్మాన్ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటనను గుర్తు చేసుకోవచ్చు. దీనితో పాటు సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సలీం ఖాన్ స్పందన
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చిన బెదిరింపులపై సల్మాన్ తండ్రి సలీం ఖాన్ కూడా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన, “సల్మాన్ నన్ను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. మూగజీవాల మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉంది. క్షమాపణ చెప్పడం అంటే ఆయన తప్పు చేసినట్లు అంగీకరించినట్లే అవుతుంది. ఆ విషయాన్ని గ్యాంగ్ సభ్యులు గుర్తించాలి” అని తెలిపారు.
జంతు ప్రేమికుడిగా సల్మాన్
సల్మాన్ ఖాన్ మీద గతంలో కృష్ణజింక వేట కేసు నడుస్తున్నప్పటికీ, ఆయన జంతువులను హాని చేయడానికంటే ప్రేమించడమే ఎక్కువగా చేస్తారని సలీం ఖాన్ స్పష్టం చేశారు. జంతువులను చంపడం ఆయనకు ఇష్టం లేదని కూడా తండ్రి పేర్కొన్నారు.