బాలీవుడ్: సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణంలో నటించి రూపొందించిన సినిమా ‘రాధే’ .ఈ సినిమా మే 13 న థియేటర్లలో మరియు ఓటీటీలో ఒకేసారి విడుదల కానుంది. రంజాన్ సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని పోలి ఉంది.
పోకిరి లాగానే ముంబై లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలని, డ్రగ్స్ మాఫియా ని క్లియర్ చేయడానికి అండర్ కవర్ ఆఫీసర్ మరియు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా సల్మాన్ నటించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. నేను వచ్చింది సిటీ ని క్లీన్ చేయడానికి అంటూ వచ్చే డైలాగ్స్ చూస్తే ‘ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి కథలే చేస్తావ్ సల్మాన్ భాయ్?’ అన్నట్టు అనిపిస్తుంది. ప్రభుదేవా సినిమా మొత్తాన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసినట్టు ట్రైలర్ ద్వారా అర్ధం అవుతుంది. అంతే కాకుండా బన్నీ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ నుండి సీటీ మార్ పాటని స్టెప్స్ తో సహా సినిమాలో పెట్టినట్టు తెలుస్తుంది.
ఏ మాత్రం కొత్తదనం లేని ఈ సినిమా ట్రైలర్ లో విలన్ గా నటించిన ‘రణదీప్ హుడా’ లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాని సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సల్మాన్ ఖాన్ – సోహైల్ ఖాన్ – రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ‘వాంటెడ్’ (పోకిరి రీమేక్), ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత ప్రభుదేవా, సల్మాన్ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా.