ముంబయి: స్మార్ట్ ఫోన్లతో ఆలరిస్తున్న ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఇప్పుడు భారత్ లో స్మార్ట్ వాచ్ లతో అలరించనుంది. భారత్ లోని నోయిడా యూనిట్ స్మార్ట్ వాచ్ ల తయారీ ప్రారంభించింది. ఇప్పటికే 4జి టెక్నాలజీ తో ఒక స్మార్ట్ వాచ్ ని 28,490 రూపాయలకు మార్కెట్ లోకి విడుదల చేసింది.
శాంసంగ్ కంపెనీ మేకిన్ ఇండియా స్పూర్తితో భారత్ లో 18 స్మార్ట్ వాచ్ లను విడుదల చేయాలని అందుకు అనుగుణంగా ఇప్పటికే తయారీని మొదలు పెట్టినట్టు ఆ కంపెనీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గలాక్సీ వాచ్ యాక్టివ్2 అనే అత్యాధునిక 4జీ టెక్నాలజీ స్మార్ట్ వాచ్ ని జూలై 11న భారత్ లోకి విడుదల చేయనుంది. మూడు రకాల పరిమాణాలు 42, 44, 46 ఎం ఎంలతో శాంసంగ్ ఈ వాచ్ లను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ వాచ్‌లో ఇ-సిమ్ కనెక్టివిటీ ఉంటుందని, దీని ద్వారా వినియోగదారులు కాల్స్, మెసేజెస్, నోటిఫికేషన్స్ తదితర అత్యాధునిక సేవలను పొందవచ్చని తెలుస్తోంది.
భారత్ లో తయారు చేయనున్న 18 రకాల స్మార్ట్ వాచ్ ల ధర రూ 19,900 నుండి రూ 35,990 గా శాంసంగ్ నిర్ణయించిందని సమాచారం.
ఇప్పటికే భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో మంచి వాటా పొందిన శాంసంగ్ మరి ఈ స్మార్ట్ వాచ్ లతో మార్కెట్ లో ఎంత వాటా పొందనుందో వేచి చూడాలి.