జమైకా : వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్ మార్లన్ శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. 2000వ సంవత్సరంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన శామ్యూల్స్ విండీస్ మిడిలార్డర్ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచాడు.
శామ్యూల్స్ 207 వన్డేలు, 71 టెస్టులు,67 టీ20లు ఆడి అన్ని ఫార్మాట్లు కలిపి 11,134 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి. అలాగే అన్ని ఫార్మాట్లు కలిపి తన ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తో 152 వికెట్లు తీశాడు. 2012, 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు విండీస్ గెలవడంలో కూడా శామ్యూల్స్ కీలకపాత్ర పోషించాడు.
2016 వరల్డ్‌కప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో 85 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్‌తో టీ20 ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా శామ్యూల్స్ రికార్డు కూడా నెలకొల్పాడు. 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌తో కలిసి శామ్యూల్స్ రెండో వికెట్‌కు 372 పరుగులు జోడించడం ఇప్పటికీ ఒక రికార్డుగా ఉంది.
2018 డిసెంబర్ తర్వాత శామ్యూల్స్ విండీస్ తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. తన కెరీర్‌లో ఆటకంటే వివాదాలతోనే శామ్యూల్స్ ఎక్కువగా పేరు పొందాడు. ఈ మధ్యనే ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ భార్యపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి షేన్ వార్న్ ఆగ్రహానికి కూడా గురయ్యాడు. అంతకముందు కూడా 2012లో బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా వార్న్, శామ్యూల్స్ మధ్య పెద్ద గొడవే చోటుచేసుకుంది.