అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్‌ఈబీ) మంచి జోరు మీద ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం, ప్రత్యేక చెక్‌పోస్టుల ద్వారా నిఘా, ఆకస్మిక తనిఖీలతో ఎడాపెడా దాడులు చేస్తూ అక్రమ రవాణాదారుల ఆటకట్టిస్తోంది. ఇసుక, మద్యం అక్రమ రవాణాదారులపై గత మూడు నెలల్లోనే రికార్డుస్థాయిలో కేసులు నమోదు చేసి, అరెస్టులు కూడా చేసింది.
ఈ ఏడాది మే 16 నుంచి సెప్టెంబరు 7 వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించింది. రికార్డుస్థాయిలో కేసులు నమోదు, అరెస్టులతో ఇసుక, మద్యం అక్రమరవాణాదారులను గడగడలాడించింది. ఎస్‌ఈబీ ఇసుక అక్రమరవాణాపై దాడులు నిర్వహించి 3,570 కేసులు నమోదు చేసి 6,863 మందిని అరెస్టు చేసింది. 4,765 వాహనాలను, 4,28,127.71 టన్నుల ఇసుకను జప్తు చేసింది. సారా తయారీ, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్‌ఈబీ విస్తృతంగా దాడులు నిర్వహించింది.
మూడు నెలల్లో 36,895 కేసులు నమోదు చేసింది. 47,695 మందిని అరెస్టు చేసి13,675 వాహనాలను జప్తు చేసింది. 265.22 లీటర్ల అక్రమంగా రవాణా చేస్తున్న 265.22లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. 202.86 లీటర్ల సారాను జప్తు చేయడమే కాకుండా 4,303 లీటర్ల కాపు సారాను ధ్వంసం చేసింది.
ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్‌ఈబీ వ్యవస్థాగతంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో ఐదు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉండనే ఉన్నాయి. ఇక అనంతపురం జిల్లాల్లో ఎస్పీ స్పెషల్ ఆపరేషన్ బృందాలను ఏర్పాటు చేశారు కూడా. రాష్ట్రవ్యాప్తంగా 289 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అక్రమ రవాణాపై పూర్తి సమాచారం వచ్చేలా నిఘా వ్యవస్థను పటిష్టపరిచారు.
ఇంటెలిజెన్స్‌వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. జిల్లా స్థాయిలో నోడల అధికారి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఏపీఎండీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమన్వయం సాంకేతిక అంశాలపరంగా కూడా సమగ్రంగా కేసు నమోదు చేస్తున్నారు.