టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు గెలిచినప్పుడే, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ టోర్నీలో రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి చేరడంతో, భారత మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచింది.
ఫైనల్ మ్యాచ్‌లో ఆడుతానని భావించానని, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తనకు అవకాశం ఇవ్వాలనుకున్నారని సంజూ వెల్లడించాడు.
ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోహిత్ తనకు ఫోన్ చేసి, మ్యాచ్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పాడని, అయితే టాస్‌కు కొద్ది నిమిషాల ముందు తనను జట్టులోకి తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని తెలిపాడు.
రోహిత్ తన వద్దకు వచ్చి, సెమీ ఫైనల్ జట్టును కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పాడని పేర్కొన్నాడు. సన్నద్ధమవుతూ ఉన్నప్పటికీ చివరకు ఆడే అవకాశం రాలేదు అని చెప్పారు.
జర్నలిస్ట్ విమల్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజూ ఈ విషయాలు పంచుకున్నాడు. “ఫైనల్ మ్యాచ్ ముందు రోహిత్ నన్ను పక్కకు తీసుకెళ్లి పరిస్థితి వివరిస్తూ, నీకు అర్థమైందా అని ప్రశ్నించాడు. నా పరిస్థితిని బాగా అర్థం చేసుకొని మనస్పూర్తిగా రోహిత్ నిర్ణయాన్ని స్వీకరించాను. ముందుగా మ్యాచ్‌పై దృష్టి పెట్టండి, నెగ్గిన తర్వాత మాట్లాడుకుందాం అని రోహిత్‌ను ప్రోత్సహించాను” అని పేర్కొన్నాడు.