టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా సారంగపాణి జాతకం విడుదలకు సిద్ధమైంది. ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్‌ను ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. జెంటిల్మన్, సమ్మోహనం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. తాజా సమాచారం మేరకు, సారంగపాణి జాతకం ఏప్రిల్ 18న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. అన్ని పనులు పూర్తయ్యాయి, కేవలం సెన్సార్ క్లియర్ చేయడమే మిగిలి ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ అందించిన పాటలు ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
ఇటీవల కోర్ట్ సినిమాతో విజయాన్ని అందుకున్న ప్రియదర్శి, ఈసారి సారంగపాణి జాతకం ద్వారా మరింత మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. సినిమాలో ఆయన పాత్ర పక్కా కామెడీ టచ్‌తో ఉంటుందని తెలుస్తోంది. వెన్నెల కిశోర్, వైవా హర్షా, వీకే నరేష్ కూడా సినిమాలో డిఫరెంట్ కామెడీ రోల్స్‌లో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో తణికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, శివన్నారాయణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ రూపా కొడువయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పీజీ విందా సినిమాటోగ్రఫీ, రవీందర్ ప్రొడక్షన్ డిజైన్ వర్క్ సినిమాకు అదనపు బలంగా నిలుస్తాయని టాక్.
ఏప్రిల్ మొదటి వారంలో సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. వేసవి సెలవుల్లో ఫ్యామిలీ ప్రేక్షకులకు సరైన కామెడీ ట్రీట్ అందించేందుకు సారంగపాణి జాతకం సిద్ధంగా ఉంది. మరి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి!