సమగ్ర సర్వేపై అపోహలు చెరిపేసిన సర్కార్ – ఎక్కడ ఉన్నా సమాచారం నమోదు
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వేపై అపోహలకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆధార్‌లో చిరునామా ఉన్న చోటికి, స్వగ్రామానికి వెళ్లాలన్న అవసరం లేదని స్పష్టం చేస్తూ, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడే తమ వివరాలను అధికారులకు అందించవచ్చని రాష్ట్ర ప్రణాళికశాఖ స్పష్టం చేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సులభతరంగా వివరాలు సేకరించేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
కుటుంబ సర్వే రెండో దశ ప్రారంభం
ఈరోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే రెండో దశ ప్రారంభమైంది. ఈ సర్వేలో అధికారులు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమాచారాన్ని సేకరిస్తారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, కులాల వంటి వివరాలను గణకులు నమోదు చేస్తారు. అయితే, సొంత గ్రామం వదిలి వేరే ప్రాంతంలో ఉంటున్న వారు కూడా ఎక్కడైతే ఉంటారో అక్కడే సర్వేలో పాల్గొనవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
ఆధార్ చిరునామా ప్రకారమే వెళ్లాలన్న అపోహలు – ప్రణాళికశాఖ ఖండన
తమ ఆధార్ కార్డులో ఉన్న చిరునామా దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదని, ఎక్కడ ఉంటే అక్కడే అధికారులకు తమ వివరాలు అందజేయవచ్చని ప్రణాళికశాఖ ప్రకటనలో తెలిపింది. సర్వేలో పాల్గొనే ప్రజలు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, సెల్‌ఫోన్ నంబర్లు, ప్రశ్నపత్రంలో అడిగిన ఇతర వివరాలను అందించవలసిందిగా సూచించింది.
సర్వే సౌకర్యం కోసం అవసరమైన పత్రాలు
ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసు బుక్, బ్యాంకు పాస్ బుక్ వంటి పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సర్వే అధికారుల సూచన. ఇవి ఉంటే సర్వే గణకులకు సమాచారం ఇవ్వడం సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
మొదటి దశలో ఇంటి నంబర్లు నమోదు
ఈ నెల 6 నుండి 8 వరకు నిర్వహించిన మొదటి దశ సర్వేలో ఇంటి నంబర్లు, యజమాని పేర్లను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 150 నుండి 175 ఇళ్లకు ఒక్కో గణకుడిని కేటాయించారు. ఇప్పుడు, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించేందుకు ఈ నెలాఖరు వరకు సర్వే కొనసాగుతుందని తెలిపారు. మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉండగా, వీటిని 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు.