
ఒకప్పుడు శాటిలైట్ హక్కులు తెలుగు చిత్రసీమకు బంగారు గూడు లాంటివి. టీవీ ఛానెళ్లు పెద్ద సినిమాల కోసం భారీ మొత్తాల్లో డీల్స్ చేసేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. ఓటీటీ రాకతో టీవీ ప్రసారాల క్రేజ్ బాగా తగ్గిపోయింది.
ఇటీవల ‘పుష్ప 2’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాకి కూడా టీవీలో కేవలం 12 టీఆర్పీ మాత్రమే రావడం అందరికీ షాక్ ఇచ్చింది. గతంలో అల్లు అర్జున్ సినిమాలకు 20-25 టీఆర్పీలు వచ్చేవి. ఇప్పుడు ఈ తక్కువ రేటింగ్ చూసి శాటిలైట్ మార్కెట్ పరిస్థితి ఎలా దిగజారిందో అర్థమవుతోంది.
ప్రస్తుతం కొత్త సినిమాల శాటిలైట్ హక్కులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. ఓటీటీలో సినిమా త్వరగా వచ్చేయడం, యాడ్స్ లేకుండా చూడటానికి అవకాశం ఉండడం టీవీ ప్రేక్షకుల ఫోకస్‌ను మళ్లించింది. దీంతో చానెళ్లు పెద్ద మొత్తాల ఆఫర్లు ఇవ్వడానికి వెనకడుగేస్తున్నాయి.
ఇక సినిమా నిర్మాతలు కూడా ఓటీటీ, శాటిలైట్ హక్కులను కలిపి చిన్న డీల్స్‌తో పని పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు. మిడ్ రేంజ్ సినిమాలైతే టీవీ మార్కెట్‌పై ఆధారపడకుండా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి టీవీలో కొత్త సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల శాటిలైట్ మార్కెట్ రోజురోజుకీ మరింత క్షీణిస్తోంది.