ఇంటర్నేషనల్: హజ్ సీజన్ ప్రారంభానికి ముందు సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా నమోదు కాకుండా వీసాలతో హజ్‌యాత్రకు వస్తున్న వారిని కట్టడి చేయాలని నిర్ణయించింది. దీంతో భారత్ సహా 14 దేశాల పౌరులకు తాత్కాలికంగా వీసాలపై నిషేధం విధించింది.
ఈ నిర్ణయం ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలపై ప్రభావం చూపనుంది. హజ్‌కు సంబంధించి గతేడాది చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనల అనంతరం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన నేపథ్యంలోనే తాజా చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఇప్పటినుంచే హజ్ నిర్వహణను భద్రంగా చేపట్టేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కోటాలోనే వెళ్లాలంటూ సూచనలు జారీ అయ్యాయి. అధికారికంగా రిజిస్టర్ అయిన యాత్రికులు, సౌదీలో నివాసం ఉన్నవారు మాత్రమే ప్రయాణించవచ్చు.
వీసా నిషేధం ఉన్న దేశాల్లో భారత్, పాక్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఈజిప్ట్, నైజీరియా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాల వారు నిబంధనలు పాటించకుండా ప్రయాణించలేరు. ప్రభుత్వం ద్వారా వచ్చిన కోటాలో మాత్రమే అవకాశం లభించనుంది.
ఈ చర్యలతో నిబంధనల ప్రకారం ప్రయాణాలు జరిగేలా చేయాలన్నదే సౌదీ ఉద్దేశమని తెలుస్తోంది. ప్రభుత్వాలు తమ పౌరులకు దీన్ని గమనించి ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ సూచనలొస్తున్నాయి.