ముంబై: భారత్ లో వరుస పండుగల నేపథ్యంలో నేషనల్ బ్యాంకింగ్ దిగ్గజం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన గృహ రుణాలకు సంబంధించి అవలంబిస్తున్న వడ్డీరేట్లపై 25 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) వరకూ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది.
రూ.75 లక్షలకుపైగా రుణం, సిబిల్ స్కోర్, బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా దరఖాస్తు చేసుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా రాయితీ వర్తిస్తుందని బుధవారం విడుదలైన బ్యాంక్ ప్రకటన తెలిపింది. రూ. 30 లక్షలకుపైబడి, రూ.2 కోట్ల వరకూ గృహ రుణాలపై క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రాయితీ ఇప్పటి వరకూ 10 బేసిస్ పాయింట్లు ఉంది. ఇకపై ఈ రాయితీని 20 బేసిస్ పాయింట్లకు పెంచుతున్నట్లు తెలిపింది.
ఎస్‌బీఐ ‘యోనో’ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే రిటైల్ కస్టమర్లకు కారు, పసిడి, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును ఎస్‌బీఐ 100 శాతం మాఫీ చేస్తోంది. అలాగే, నిర్దిష్ట ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలు చేసే వారికి కూడా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తోంది.
కాగా అధిక ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణ వృద్ధికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండడంలేదని బ్యాంకింగ్ పరిశ్రమ పేర్కొంటోంది. అయితే క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయనీ, వినియోగ విశ్వాసం, డిమాండ్ మెరుగుపడుతుందనీ, ప్రత్యేకించి ఎస్‌బీఐ ఇస్తున్న గృహ రుణ ఆఫర్లు ఈ విభాగంలో డిమాండ్ పెరుగుతుందని విశ్వసిస్తున్నామని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి పేర్కొన్నారు.
రూ.799 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజుతో 10.99 శాతానికి పడిసి రుణాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ రేటు ఇప్పటికే 7 శాతానికి తగ్గింది. పండుగల సీజన్ నేపథ్యంలో రిటైల్, వ్యవసాయ రంగాలకు సంబంధించి రుణ ప్రాసెసింగ్ ఫీజు రద్దు, వేగవంతమైన ఆన్‌లైన్ ఆమోదాలు వంటి ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.