ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరో కీలక మైలురాయిని అధిగమించింది. హోంలోన్ బిజినెస్‌లో రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా కస్టమర్లకు హోంలోన్లపై అతి తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ లాంటి పలు ఆఫర్లను స్టేట్ బ్యాంక్ ప్రకటించింది.
రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ బిజినెస్ యూనిట్ (రెహబు) గత పదేళ్ళలో దాదాపుగా 5 రెట్లు మేర పుంజుకోవడం విశేషం. కరోనా మహమ్మారి, లాక్డౌన్ వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ భారీ వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఆ దిశగానే అలాగే రోజుకు వెయ్యిమంది గృహ రుణ కస్టమర్లు సరసమైన వడ్డీరేటుకే లోన్లను అందించనుంది. ఈ ఏడాది మార్చి 31 వరకూ ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. కొత్త గృహ రుణ వినియోగదారుల కోసం బ్యాంక్ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. 7208933140 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మొత్తం వివరాలు తెలుసుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది.
సొంత ఇంటి కలల్ని సాకారం చేసుకోవాలనుకునే వినియోగదారులకు సరసమైన వడ్డీరేటులో రుణాలను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతర ప్రయత్నం చేస్తున్నామని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా అన్నారు.ఈ కృషిలో భాగంగానే 5 లక్షల మార్క్ తమకు గొప్ప విజయం, తమపై వినియోగదారుల నమ్మకానికి నిదర్శనమన్నారు. మార్కెట్ లీడర్‌గా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు.
అయితే పీఎమ్వై సబ్సిడీని అందించేందుకు సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సిఎన్ఎ)గా గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన ఏకైక బ్యాంకు ఎస్బీఐ. ‘2022 నాటికి అందరికీ హౌసింగ్’ అనే ప్రభుత్వ కార్యక్రమానికి మద్దతుగా, పీఎంవై కింద గృహ రుణాలను అందిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 2020 నాటికి 1,94,582 గృహ రుణాలను మంజూరు చేసింది.